బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు: పదో తరగతి విద్యార్థినికి విముక్తి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని బాలింతరం గ్రామంలో అధికారులు సకాలంలో స్పందించి ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
గ్రామానికి చెందిన 15 ఏళ్ల పదో తరగతి చదువుతున్న బాలికకు, 36 ఏళ్ల వ్యక్తితో ఈ నెల 26న వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు నిశ్చితార్థం పూర్తి చేసి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి రావడంతో కమిషన్ సభ్యులు డాక్టర్ నాగమాంస, గంగ సూర్యనారాయణ రంగంలోకి దిగారు.
పోలీస్, రెవెన్యూ, అంగన్‌వాడీ విభాగాల అధికారులు, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్న అధికారులు ఇరు కుటుంబాలకు చట్టపరమైన నిబంధనలు, బాల్య వివాహాల దుష్పరిణామాలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆ వివాహాన్ని రద్దు చేయించారు.
బాలిక చదువు మధ్యలోనే ఆగిపోకుండా ఉండేందుకు (డ్రాపౌట్ కాకుండా) అధికారులు పాఠశాల హెచ్ఎంతో నాగ మానస మాట్లాడారు. బాలికను తిరిగి సోమవారం పాఠశాలలో చేర్పించి విద్యాభ్యాసం కొనసాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
